అమెరికా పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడం, ప్రవాసాంధ్రుల్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి సారథ్యంలో 16 మంది బృందం గురువారం తెల్లవారుజామున 4:40 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరింది. భారత కాలమానం ప్రకారం అదే రోజు రాత్రి 7:30 గంటలకు శాన్ఫ్రాన్సిస్కో చేరుకుటుంది. ఈ నెల 11 వరకు కొనసాగే పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలుగువారితో సమావేశాలు నిర్వహిస్తారు. భారత్, అమెరికా వాణిజ్య మండలి (యుఎస్ఐబీసీ) వార్షిక వెస్ట్‌కోస్ట్ సమ్మిట్-2017 లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేదికపై ఆయన ట్రాన్స్ఫర్మేటివ్ సీఎం పురస్కారాన్ని అందుకోనున్నారు.













