బీజేపీ, వైకాపా కుట్రలో భాగమే ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును, ఎస్పీ శ్రీకాకుళం, ఎస్పీ కడప లను వెంటనే బదిలీ చేయాలని, వారి తర్వాత సీనియారిటీ ఉన్న అధికారులకు ఛార్జి హ్యాండోవర్ చేసి రిలీవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. వారి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు ముగ్గురు అధికారుల ప్యానల్‌ను పంపించాలని కూడా కోరింది.
కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ పంపిన లేఖలో ఆ అధికారి బదిలీకి గల కారణాలను ప్రస్తావించలేదు. ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పాత్ర లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సెక్యూరిటీని పర్యవేక్షించే ప్రధాన బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీకి ఉంటుంది. కేవలం వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎటువంటి విచారణ జరపకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక కోరకుండా ఏకపక్షంగా ఎన్నికల సంఘం బదిలీ చేయడం ఒక రాజకీయ ప్రేరేపిత కుట్రగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.
వైఎస్సార్సీపీ, బీజేపీ కలిసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీ ప్రక్రియను రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు చేపట్టిన బదిలీ. ఎన్నికలు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఏమాత్రం సంబంధంలేని డీజీ ఇంటెలిజెన్స్ బదిలీ ముఖ్యమంత్రి రక్షణకు ముప్పు తెచ్చే చర్యగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ఎన్నికల యంత్రాంగానికి భయాందోళనలు కలిగించి రాజకీయంగా తెలుగుదేశంపార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని, బీజేపీ, వైకాపా, కేసీఆర్ కలిసి పన్నిన ఈ రాజకీయ కుట్రను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అంశంపై న్యాయపరంగా చర్యలు తీసుకుని తెలుగుదేశంపార్టీపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, బీజేపీ, వైకాపా కలిసి చేపడుతున్న ఈ కుట్రలను ప్రజల దృష్టికి తీసుకెళతాం. న్యాయపరంగా ఎదుర్కొని బీజేపీ, వైకాపాలకు తగిన బుద్ధి చెబుతాం.
ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటు ప్రజల ప్రాథమిక హక్కు. లక్షల మంది ఓట్లను కుట్రపూరితంగా తొలగించడానికి వైసీపీ చేసిన దుర్మార్గంపై టీడీపీ చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోగా, విచారణకు కావలసిన ఆధారాలు కూడా లేకుండా ఆన్లైన్లో ఫారం-7 ఫైల్ చేసిన వారి ఐపీ అడ్రస్‌లు కూడా తొక్కిపెట్టి వైకాపాతో ఎన్నికల సంఘం కుమ్మక్కైంది. తెలుగుదేశంపార్టీ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా వైకాపా వారు ఇచ్చిన ఫిర్యాదుపై ఆఘమేఘాలమీద ఎన్నికల సంఘం తీసుకున్న ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి.
వివేకానందరెడ్డి మరణం వెనుక దాగివున్న రహస్యాలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్న కడప జిల్లా ఎస్పీని బదిలీ చేయడం ద్వారా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చుకునే యత్నం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తును వాయిదా వేయించమని, థర్డ్ పార్టీ విచారణ చేయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైకాపావారు వేయించిన కేసు కూడా వివేకానందరెడ్డి హత్య వెనుక దాగివున్న నిజాలను ఎన్నికల సమయంలో బయటకు రానీయకుండా వాయిదా వేయించే కుట్రలో భాగమే.













