నంద్యాల బరిలో భూమా కుటుంబం!
నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఆ కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని పోటీకి దించడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం విజయవాడ పర్యటనలో అఖిలప్రియ ఈ నెల 24న తేదీన తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి రోజున తమ కుటుంబం నుంచి అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని అభిమానుల సమక్షంలో అఖిలప్రియ ప్రకటించే అవకాశం ఉంది. భూమా నాగిరెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి తనయుడైన బ్రహ్మానందరెడ్డి చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో ఉన్నారు. బాబాయి నాగిరెడ్డి, పిన్నమ్మ శోభానాగిరెడ్డికి చేదోడుగా ఉంటున్న ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువే. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న కాటసాని రామిరెడ్డికి అల్లుడు కావడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అదనపు లాభం.













