తానా మహాసభల కోసం చురుగ్గా ఏర్పాట్లు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు ఈ సంవత్సరం జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ డీసిలోని వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరితోపాటు తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు శ్రమిస్తున్నారు. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా డా. వెంకట్రావు ముల్పూరి వ్యవహరిస్తున్నారు.
తానా మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానాలను తానా నాయకులు అందజేస్తున్నారు. ఈ మహాసభలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం.
సినీ సంగీత దర్శకుడు కీరవాణి తన బృందంతో సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని చిత్రతోపాటు సునీత, శ్రీకృష్ణ, అనిరుధ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల, నాట్యకళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ అవధాని మేడసాని మోహన్, లలిత సంగీత దర్శకుడు, గాయకుడు రామాచారి తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు.
సినిమా హీరోలు జగపతిబాబు, నారా రోహిత్, సునీల్,తోపాటు యాంకర్ సుమ, అనసూయ దర్శకులు రాఘవేంద్రరావు కూడా మహాసభలకు వస్తున్నారు. ఈ మహాసభల్లో మరో ముఖ్య ఆకర్షణగా జబర్దస్త్ టీం నిలవనున్నారు. జబర్దస్త్ టీం ఈ మహాసభల్లో అందరినీ నవ్వించనున్నారని తానా కార్యదర్శిగా ఎన్నికైన రవిపొట్లూరి చెప్పారు.
ఈ మహాసభలను పురస్కరించుకుని పలు నగరాల్లో తానా తరపున క్రీడాపోటీలను, భాషా పోటీలను, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ రకాల కార్యక్రమాలతోపాటు మహాసభల్లో తెలుగుదనం వెల్లివిరిసేలా కార్యక్రమాలను రూపొందించేందుకు కల్చరల్ కమిటీలు, ఇతర కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.













