తమిళనాట దళపతి ప్రభంజనం.. 60 ఏళ్ల ద్రవిడ కోటను బద్దలుకొట్టిన విజయ్ ‘టీవీకే’!
తమిళనాడు (Tamil Nadu) రాజకీయ ముఖచిత్రంపై ఎవరూ ఊహించని అద్భుతమైన బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్ ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉక్కుకోటలా ఉన్న రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, అగ్ర కథానాయకుడు ‘దళపతి’ విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం‘ (టీవీకే) పార్టీ ఎన్నికల బరిలో చారిత్రక విజయం దిశగా దూసుకుపోతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకునే అంచున నిలిచి దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కేంద్రబిందువుగా మారింది.
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ‘టీవీకే’..
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి అందరి అంచనాలను తలకిందులు చేసింది. కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, మధ్యాహ్నం 1 గంట సమయానికి రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గానూ టీవీకే ఏకంగా 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ పార్టీ కేవలం 11 సీట్ల దూరంలో నిలవడం విశేషం. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాల మధ్య నూతన ప్రత్యామ్నాయ శక్తిగా (Tamil Nadu) బరిలోకి దిగిన టీవీకే సాధిస్తున్న ఈ అసాధారణ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 1962లో కె. కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత, తమిళనాడులో ఒక ద్రవిడేతర పార్టీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి కానుండటం ఒక చారిత్రక ఘట్టం.
ఇవి కూడా చదవండి
ద్రవిడ సిద్ధాంతాల మేళవింపుతోనే సక్సెస్
ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ (Tamil Nadu) ఎన్నికల్లో తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయమే లేదనుకున్న తమిళ ఓటర్లకు విజయ్ రాక ఒక స్పష్టమైన, బలమైన ‘కొత్త ఎంపిక’ను అందించింది. పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని తన విధానాల్లో అంతర్భాగం చేయడం, అలాగే రాజకీయ దిగ్గజాలు, వ్యవస్థాపకులైన అన్నాదురై (డీఎంకే), ఎంజీఆర్ (ఏఐఏడీఎంకే) ఆశీస్సులు తనకు ఉన్నాయని పదేపదే ప్రచారం చేయడం ద్వారా విజయ్ ప్రజల హృదయాలకు మరింత చేరువయ్యారు.
అధికార డీఎంకేకు కోలుకోలేని షాక్!
ఈ అనూహ్య ఫలితాలు అధికార డీఎంకేకు నిజంగా కోలుకోలేని దెబ్బ. వరుస విజయాలతో పూర్తి దూకుడు మీద ఉన్న స్టాలిన్ పార్టీకి ఇది ఊహించని భారీ పరాజయం. 2011 అసెంబ్లీ (Tamil Nadu) ఎన్నికల్లో జయలలిత చేతిలో ఓటమి పాలైన తర్వాత డీఎంకే దాదాపు పదేళ్ల పాటు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం విజయ్ సృష్టిస్తున్న సునామీతో డీఎంకేకు మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే తలెత్తవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐఏడీఎంకేకు కొత్త ఊపిరి
మరోవైపు, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేకు ఈ ఎన్నికల ఫలితాలు ఒకరకంగా పునరుజ్జీవాన్నిచ్చాయని చెప్పాలి. సరైన నాయకత్వం లేకపోవడం, ముఖ్య నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ తీవ్రంగా బలహీనపడిందని అంతా భావించారు. కానీ, ఉత్తర, పశ్చిమ తమిళనాడు (Tamil Nadu) ప్రాంతాల్లో తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును, పట్టును నిలుపుకుని ఏఐఏడీఎంకే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నికల్లో ఓటమి పాలైనా, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మించుకోవడానికి ఈ ఫలితాలు ఒక బలమైన పునాదిని వేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద, కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా సరైన రాజకీయ వ్యూహంతో అడుగుపెట్టిన దళపతి విజయ్.. ద్రవిడ పార్టీల ఆరు దశాబ్దాల గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతూ తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికారు.
ఇవి కూడా చదవండి








