విజిల్’ వేయించిన విజయ్ హామీలు.. మ్యానిఫెస్టో మేజిక్‌తో మారిన ‘తమిళ’ రాజకీయ చిత్రం!
Tamil Nadu Election: తిరిగెళ్లే ఐడియానే లేదు.. ఐయామ్ కమింగ్” తన చివరి చిత్రం ‘జననాయగన్’లో విజయ్ పలికిన ఈ సంభాషణ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. సినిమా తెరపైనే కాదు, రాజకీయ రణక్షేత్రంలోనూ ఈ దళపతి తన ‘మాస్టర్’ ప్లాన్‌తో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేశారు. అగ్ర పార్టీలకు చుక్కలు చూపిస్తూ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అసలైన ‘సర్కార్’గా అవతరించే దిశగా దూసుకుపోతోంది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే..
రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించినప్పుడే విజయ్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాజకీయాలు తనకు హాబీ కాదని, అదొక పవిత్రమైన సేవ అని చెబుతూ.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరాటం చేయడమే విజయ్‌ని యువత (Gen-Z) దృష్టిలో ‘గోట్ (GOAT)’గా నిలబెట్టింది.
ఇవి కూడా చదవండి
సామాజిక సేవే లక్ష్యంగా..
2009లోనే తన ఫ్యాన్ క్లబ్‌లను ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్ (VMI)’ పేరుతో ఏకీకృతం చేసిన విజయ్, సామాజిక సేవే లక్ష్యంగా పనిచేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో ఈ క్యాడర్ స్వతంత్రంగా పోటీ చేసి 115 స్థానాల్లో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది. నీట్ వ్యతిరేక పోరాటం, శ్రీలంక తమిళులకు మద్దతు వంటి అంశాలపై ఆయన మొదటి నుంచీ గళం వినిపిస్తూనే ఉన్నారు.
సిద్ధాంతాలనే ఆయుధాలుగా..
విజయ్ రాజకీయ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ర్యాలీల్లో జరిగిన తొక్కిసలాట సంఘటనలు, వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థుల విమర్శలు, సెన్సార్ బోర్డు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. అయితే, ఏ విమర్శకు కుంగిపోకుండా తన సిద్ధాంతాలనే ఆయుధాలుగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లారు.
ఓటర్లను ఆకట్టుకున్న హామీలు..
టీవీకే మ్యానిఫెస్టోలోని అంశాలు గ్రౌండ్ లెవల్లో మ్యాజిక్ చేశాయి. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, రూ. 25 లక్షల వరకు విద్యార్థుల రుణాలు , 8 గ్రాముల బంగారం వంటి హామీలు మహిళలు, యువతను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా కులగణనపై ఇచ్చిన హామీ, డీఎంకే అవినీతిపై చేసిన పోరాటం ఓటర్లను టీవీకే వైపు మళ్లించాయి.
ప్రజలు ‘దళపతి’కి బ్రహ్మరథం..
తమిళనాట సినీ గ్లామర్‌తో వచ్చి రాజకీయాన్నే శాసించిన ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు విజయ్ చేరారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పక్కన పెట్టి, ప్రజలు ‘దళపతి’కి బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే, తమిళనాడులో ‘విజయ్ శకం’ మొదలైనట్లు స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి








