ఫల్టాలో రీ పోలింగ్… ఈసీ సంచలన నిర్ణయం
బెంగాల్ లో రోజుకో ఘటన జరుగుతోంది. ఇది రాజకీయంగా మరింత వేడిని రాజేస్తోంది. బెంగాల్ లో ఎన్నికల రోజున, పోలింగ్ కి ముందు కూడా వరుసగా కొన్ని హింసాత్మక ఘటనలు జరుగుతూనే వున్నాయి. దీంతో ఇప్పటికే 11 స్థానాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ డిసైడ్ అయ్యింది. తాజాగా ఈసీ మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. బెంగాల్ లోని ఫల్టా నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫల్టాలోని మొత్తం 285 కేంద్రాల్లో ఈ నెల 21 న రీపోలింగ్ జరగనుంది. కౌటింగ్ 24 న జరుగుతుంది. మిగిలిన 293 నియోజకవర్గాల్లో సోమవారం కౌంటింగ్ జరగనుంది.
నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 24న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని మిగతా 293 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ ప్రకారం రేపు ఓట్ల లెక్కింపు యథావిధిగా కొనసాగుతుంది.
పోలింగ్ రోజున ఫల్టాలో ఈవీఎంల ట్యాంపరింగ్, అనేక బూత్‌లలో నిఘా కెమెరాలను స్విచ్ ఆఫ్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని బూత్‌లలో ఈవీఎంలకు టేపులు చుట్టడం, మధ్యాహ్నం ఒంటి గంటకు వాటిని తొలగించే సమయానికే 58 శాతం పోలింగ్ నమోదు కావడం ఎన్నికల పారదర్శకతపై సందేహాలకు దారితీసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రతా గుప్తా, క్షేత్రస్థాయిలో పర్యటించి ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఎన్నికల సంఘం నియోజకవర్గం మొత్తం పోలింగ్‌ను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.








