బెంగాల్ పీఠంపై ‘కమలం’ గురి.. మేజిక్ ఫిగర్ దాటిన బీజేపి!
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, ప్రారంభ ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీ మార్కును బీజేపీ ఇప్పటికే దాటేసింది.
మెజారిటీ మార్కు దాటిన బీజేపీ…
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లలోనే బీజేపీ తన ప్రతాపాన్ని చూపింది. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 154 స్థానాల్లో ముందంజలో ఉండగా.. అధికార టీఎంసీ 108 స్థానాలకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపించినప్పటికీ, ఈవీఎం ఓట్లు విప్పేసరికి బీజేపీ తన పట్టును బిగించింది.
రౌండ్ రౌండ్‌కు ట్రెండ్స్ మారుతూ..
బీజేపీ కీలక నేత సువేందు అధికారి తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపారు. పలు నియోజకవర్గాల్లో ఆధిక్యం కేవలం వందల ఓట్ల తేడాతోనే ఉండటంతో, రౌండ్ రౌండ్‌కు ట్రెండ్స్ మారుతూ ఉత్కంఠను రేపుతున్నాయి.
అధికార టీఎంసీ శ్రేణుల్లో నిరాశ..
బీజేపీ ఘనవిజయం దిశగా అడుగులు వేస్తుండటంతో అధికార టీఎంసీ శ్రేణుల్లో నిరాశ ఆవహించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద , టీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఎప్పుడూ ఉండే హడావుడి కనిపించకుండా, నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతుందా? మమతా బెనర్జీ ఈ క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కుతారా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఇవి కూడా చదవండి








