రష్యాను వెంటనే వీడండి : అమెరికా
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. రష్యాలోని అమెరికన్లందరూ వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్లో ఇరుపక్షాల మధ్య తీవ్ర తరమవుతోన్న దాడులతోపాటు రష్యన్ భద్రతా సంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. రష్యాలో నివసిస్తున్న లేదా పర్యటిస్తోన్న అమెరికా జాతీయులు వెంటనే దేశాన్ని వీడి బయలుదేరాలి అని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. తప్పుడు నిర్బంధాల అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. దీంతో పాటు అమెరికన్లను రష్యాకు వెళ్లొద్దని పేర్కొంది. గూఢచార్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అమెరికా పౌరుడిపై క్రిమినల్ కేసు ప్రారంభించినట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) ఇటీవల తెలిపిన వేళ తాజా ప్రకటన వచ్చింది.













