కాలిఫోర్నియాలో నిర్వహించే వరల్డ్ కప్‌కు ఏపీ విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి తర్వలో కాలిఫోర్నియాలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొననుంది. కానపల్లె గ్రామానికి చెందిన ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాలుగో తరగతలిలోనే కడపలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తర్వాత శ్రీదేవి నెల్లూరు శాప్ అకాడమీలో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. పుట్బాల్పై పట్టు ఉన్న శ్రీదేవి ఎన్నో మార్లు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.
గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్, కటక్‌లో జరిగిన జూనియర్ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఇండియా ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానం లో నిలిచింది. విద్యార్థినికి కోచ్‌గా కె.సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు.













