మరింత ఉన్నతస్థాయికి ఇండో- యూఎస్ వాణిజ్య బంధం ..!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింతగా విస్తరిస్తోంది. ఓవైపు అగ్రరాజ్యం.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఉన్న భారత్ మధ్య వాణిజ్య బంధం.. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా రూపుదిద్దుకుంటోంది. పలు అంశాల్లో ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి కూడా. అయితే కీలకమైన టారిఫ్ ల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటోంది భారత్.
భారత్-అమెరికా (ఇండియా-యుఎస్) దౌత్య , వాణిజ్య చర్చల ఫలితంగా రక్షణ, సాంకేతికత (టెక్నాలజీ) మరియు ఇంధన రంగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలు కుదిరాయి. సాంప్రదాయక కొనుగోలుదారు-విక్రేత సంబంధం నుంచి ఇరు దేశాలు కలిసి వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఈ ఒప్పందాలు సహాయపడ్డాయి.ఇరు దేశాల మధ్య కీలక అంశాల్లో అంగీకారం కుదిరింది.
10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్‌వర్క్ (2025-2035):
ఇరు దేశాల మధ్య రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ సరికొత్తగా పదేళ్ల రక్షణ కార్యాచరణ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా ఆయుధాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (Javelin Anti-Tank Missiles) వంటి ఆధునిక ఆయుధాలను భారత్‌లోనే సంయుక్తంగా తయారు చేయడానికి అంగీకారం కుదిరింది.భారత సైన్యంలో ఉన్న అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ గన్ల నిర్వహణ , సాంకేతిక సహాయం కోసం అమెరికా సుమారు $482 మిలియన్ల సపోర్ట్ ప్యాకేజీని ఆమోదించింది. అత్యవసర సమయాల్లో ఇరు దేశాల సైన్యాలకు అవసరమైన పారిశ్రామిక వనరులను పరస్పరం ప్రాధాన్యతపై సరఫరా చేసుకునేందుకు వీలుగా ‘సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్’ (SOSA) పై సంతకాలు జరిగాయి. వ్యూహాత్మక సమాచార మార్పిడిని పెంచడానికి ఫ్లోరిడాలోని అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో భారత సైనిక అధికారిని నియమించేందుకు మొట్టమొదటిసారిగా అంగీకారం కుదిరింది.
ఇవి కూడా చదవండి
ట్రస్ట్ (TRUST) ఇనిషియేటివ్:
గతంలో ఉన్న ఐసీఈటీ (iCET) ని మార్చి, ‘ట్రాన్స్ఫార్మింగ్ ది రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ’ (TRUST) పేరిట సరికొత్త కూటమిని ఏర్పాటు చేశారు. భవిష్యత్తు సాంకేతికతలైన కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ల తయారీ మరియు బయోటెక్నాలజీ రంగాలలో అమెరికా సాంకేతికతను భారత్‌కు బదిలీ చేసేందుకు అంగీకారం కుదిరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక పన్ను మినహాయింపులు కల్పించారు.
ఇంధన భద్రత (Energy Security):
భారతదేశ ఇంధన అవసరాల కోసం అమెరికా నుండి క్లీన్ ఎనర్జీ, ఎల్ఎన్జీ (LNG), ముడి చమురు మరియు బొగ్గు కొనుగోళ్లను భారీగా పెంచడానికి ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన కంపెనీలు భారత అణు విద్యుత్ రంగంలో భాగస్వాములు కావడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించారు.
(Critical Minerals)క్రిటికల్ మినరల్స్ కోఆపరేషన్:
ఎలక్ట్రానిక్స్, ఈవీ (EV) బ్యాటరీల తయారీకి అత్యంత అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల సరఫరా గొలుసు (Supply Chain) పై ప్రత్యేక ద్వైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా చైనా ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత ఎగుమతులకు ఊరట:
అమెరికా సుంకాలను తగ్గించిన జాబితాలో ఉన్న భారతీయ ఫార్మాస్యూటికల్స్ (జెనరిక్ మందులు), రత్నాలు-వజ్రాలు (Gems & Diamonds), మరియు ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలకు అమెరికా మార్కెట్లో మంచి ప్రాధాన్యత లభించింది. అమెరికా నుండి వచ్చే కొన్ని రకాల పారిశ్రామిక వస్తువులు, పండ్లు (బాదం, యాపిల్స్ వంటివి), వైన్ మరియు సోయాబీన్ ఆయిల్‌లపై భారత్ దిగుమతి పన్నులను తగ్గించడానికి అంగీకరించింది.








