కనిష్క ఘాతుకం వెనక ఖలిస్తానీ వేర్పాటువాదులు..కెనడా అంగీకారం..!
ఇన్నాళ్లు నాలుగు ఓట్లు, రాజకీయ లబ్ధికోసం ఆరాట పడిన కెనడాకు కాస్త ఆలస్యంగా అయినా వాస్తవం అర్థమవుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతకవైఖరి అవలంభిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతు, ఆశ్రయం కల్పించినా కెనడా కూడా.. ఆయా గ్రూపుల ఆగడాలపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీంతో వారి విషయంలో తన వైఖరి మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి నాలుగు దశాబ్దాల గడిచిన తర్వాత తొలిసారి.. 329 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది కెనడా. ఇన్నాళ్లు ఖలిస్థానీ వేర్పాటు వాదుల పేరును ఎన్నడూ ప్రస్తావించని ఆ దేశం.. ఇప్పుడు ఆ దారుణ మారణ కాండకు వారే కారణమని స్పష్టం చేసింది.
1985 జూన్ 23న అట్లాంటిక్ మహా సముద్రంపై ఎయిరిండియా బోయింగ్ విమానం ‘కనిష్క’ కూలి అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. టొరంటో నుంచి ముంబయికు బయల్దేరిన ఆ విమానంలో ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇది ఖలిస్థానీ ఉగ్రవాదుల పనేనని భారత్ స్పష్టంగా పేర్కొంది. కానీ కెనడా ఎన్నడూ వారి పాత్రను అంగీకరించడానికి ఇష్టపడలేదు. విచారణ తూతూ మంత్రంగా జరిపింది. దీంతో కీలక నిందితులు తప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలో కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) బుధవారం ఫేస్బుక్ పోస్ట్‌లో దాడికి ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమమే కారణమని స్పష్టం చేసింది. కెనడా స్థావరంగా పనిచేస్తున్న ఖలీస్థానీ తీవ్రవాదులే.. బాంబు పెట్టి విమానంలో ఉన్న వారినందరినీ హతమార్చారని తెలిపింది. కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్ర దాడి అని పేర్కొంది. విమానంలోని లగేజీ విభాగంలో ఖలీస్థానీ గ్రూప్ బబ్బర్ ఖాల్సా సభ్యులు నాడు బాంబులు పెట్టి విమానాన్ని కూల్చేశారు.








