భూకంప కేంద్రాల నిలయం వెనెజువెలా..?
వెనెజువెలాలో భూకంపాల విధ్వంసం దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. అయితే.. ఇంతటి తీవ్రమైన భూకంపం రావడం మాత్రం ఈ శతాబ్ధంలో ఇదే తొలిసారని చెబుతున్నారు పరిశోధకులు. ఇంతకూ వెనెజువెలాలో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి.
భౌగోలిక స్వరూపంతోనే ప్రమాదం..
వెనెజువెలా… దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర తీరంలో ఉంటుంది. ప్రధాన భూభాగమంతా దక్షిణ అమెరికా ప్లేట్ (ఫలకం)పైనే ఉన్నప్పటికీ.. ఉత్తర భాగం మాత్రం కరేబియన్ దీవులకు దగ్గరగా ఉంటుంది. ఈ దీవులన్నీ కరేబియన్ ప్లేట్ (ఫలకం)పై ఉన్నాయి. అవి ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. ఏడాదికి కనీసం 20 మి.మీ మేర దక్షిణ అమెరికా ఫలకం వైపు దూసుకొస్తున్నాయి. ఫలితంగా ఆ రెండు ప్లేట్స్ మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడి భూకంపాలకు దారి తీస్తోంది. అంతేకాకుండా దాదాపు 80 శాతం మంది వెనెజువెలా ప్రజలు భూకంపం సంభావ్యత ఎక్కువగా ఉన్న జోన్లలోనే నివసిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది.
భూకంప కేంద్రమే.. నష్టానికి కారణం
వెనెజువెలాలో భూ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండటానికి మరో కారణం భూకంప కేంద్రాలు. భూ ఫలకాల కదలిక ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడో ఒకచోట చిన్నపాటి భూకంపాలు వస్తునే ఉంటాయి. భూకంప కేంద్రం లోతు ఎక్కువగా ఉంటే.. ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. లోతు తగ్గుతున్న కొద్దీ.. తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే, వెనెజువెలాలో మాత్రం భూకంప కేంద్రాలు ఎక్కువగా 15 నుంచి 20 కి.మీ లోతులోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి.. భారీగా నష్టం వాటిల్లుతోంది.
టెక్టోనిక్ ప్లేట్స్ ఎఫెక్ట్..?
భూకంపాలు సంభవించి.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ప్రతిసారీ ‘టెక్టోనిక్ ప్లేట్స్’ అనే పదం వినిపిస్తుంది. ఇంతకీ ఏంటీ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే.. భూ గ్రహం వాస్తవానికి భారీ రాతి ఫలకాలుగా విడిపోయి ఉంది. వాటినే టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఇవి చిన్నా పెద్దా కలిసి 15 వరకు ఉన్నాయి. ఇవి.. భూమి అడుగున ఉండే మాంటిల్ అనే ద్రవరూప పొరపై తేలుతూ ఉంటాయి. ఇవి స్థిరంగా ఒక చోట ఉండవు.. నిరంతరం కదులుతూ.. ఒకదాన్నొకటి ఢీ కొట్టుకుంటాయి. అయితే, ఇవి కదులుతున్నాయన్న సంగతిని సాధారణంగా మనం గుర్తించలేం. కానీ, వీటి కదలికలు నెమ్మదిగా సాగినప్పటికీ.. చాలా ప్రభావవంతమైనవి. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ ప్రకియ సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కీలక భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి.








