రిషి సునాక్ ఒక్కడే కాదు.. ఈ దేశాల్లో కూడా ప్రధానులు భారతీయులే అని తెలుసా?
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రమాణం చేయడంతో భారత దేశంలో చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు ఒక భారతీయుడు పాలిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కమలా హారిస్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా భారత్‌లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. అయితే కొన్ని ఇతర దేశాల్లో కూడా భారత సంతతికి చెందిన వారే అత్యున్నత పదవుల్లో ఉన్నారనే విషయం మాత్రం భారతీయులకు తెలియడం లేదు. వారిలో ఒకరు లియో వరాద్కర్. ఈయన భారత సంతతికి చెందిన ఐర్లాండ్ పౌరుడు. ప్రస్తుతం రెండో టర్మ్ ఆ దేశ ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబై సమీపంలోని వసాయ్ అనే ప్రాంతంలో లియో తండ్రి నివశించేవారు. ఇక్కడే చదువుకున్న లియో.. 2003లో కేఈఎం ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేశారు. ఆయన తల్లి ఐర్లాండ్ పౌరురాలు. అంతేకాదు, లియో ఒక గే. 90 శాతం కేథలిక్ సంప్రదాయవాదులు, ఆంగ్లేయులు నివశించే ఐర్లాండ్‌లో గే అయ్యుండి, ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి రెండు సార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికవడం అంటే అది లియో సత్తాకు నిదర్శనమే. ఇప్పటికీ లియో బంధువులు ముంబై సమీపంలోనే నివశిస్తున్నారు. ఆయన అప్పుడప్పుడూ ముంబై వచ్చిన తన బంధువులను కలుస్తుంటారు కూడా.
అంతేకాదు పోర్చుగల్ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా కూడా మనవాడే. ఆయన తల్లిదండ్రులిద్దరూ గోవాకు చెందిన వారు. ఈయన కూడా రెండోసారి ఆ దేశ ప్రధానిగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆంటోనియో కేవలం పోర్చుగల్ పౌరుడే కాదు, ఆయన వద్ద ఇప్పటికీ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కూడా ఉంది.













