చైనాకు వెళ్లాల్సిన ట్యాంకర్.. రూటు మార్చి భారత్ వైపు
Crude Oil:అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత ఇంధన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై అమెరికా ఇటీవల ఆంక్షలను సడలించడంతో, భారత రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుండి భారత్‌కు ముడి చమురు దిగుమతి కానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
దారి మార్చుకున్న ‘జయ’:
లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి గ్రూప్ (LSEG) షిప్పింగ్ డేటా ప్రకారం.. ‘జయ’ అనే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ మొదట ఇరాన్ నుండి బయలుదేరి చైనా వైపు ప్రయాణించింది. అయితే, ఆగ్నేయాసియా జలాల్లోకి ప్రవేశించిన తర్వాత అనూహ్యంగా తన మార్గాన్ని మార్చుకుని భారత్ వైపు వస్తోంది. ఈ భారీ ట్యాంకర్‌లోని చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఐఓసీ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘జయ’తో పాటు ‘జోర్డాన్’ అనే మరో ట్యాంకర్ కూడా భారత్ వైపు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
గత చరిత్ర – ఆంక్షల ప్రభావం:
ఒకప్పుడు భారత్ కు ఇరాన్ ప్రధాన చమురు సరఫరాదారుగా ఉండేది. 2018లో రోజుకు 5.18 లక్షల బ్యారెళ్ల దిగుమతులు జరగగా, 2019 మే నాటికి అవి 2.68 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి. ఆ తర్వాత ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో భారత్ దిగుమతులను పూర్తిగా నిలిపివేసి, ఇతర ప్రత్యామ్నాయ దేశాలపై ఆధారపడింది. ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ఆంక్షల ఎత్తివేతతో మళ్లీ పాత బంధం చిగురిస్తోంది.
ఇటీవల ‘పింగ్ షున్’ అనే మరో ట్యాంకర్ భారత్ రావాల్సి ఉండగా, అది తన గమ్యాన్ని చైనాకు మార్చుకున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘కెప్లర్’ వెల్లడించింది. అయితే ఇప్పుడు ‘జయ’ ట్యాంకర్ భారత్ వైపు రావడం ఇంధన మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి








