చలికాలంలో గులాబీ మొక్కలు వాడిపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
చలికాలంలో మీ గులాబీ మొక్కలను పదిలంగా ఉంచే టిప్స్..
ఇంట్లో తోట ఉందంటే అందులో గులాబీ మొక్క (Rose Plant) ఉండాల్సిందే. రంగురంగుల పూలతో ఇంటి అందాన్ని పెంచే గులాబీలను పెంచడం చాలామందికి ఇష్టం. అయితే మొక్కకు ఎన్ని నీళ్లు పోయాలి? ఎప్పుడు ఎరువులు వేయాలి? ఎప్పుడు కొమ్మలను కత్తిరించాలి? అనే విషయాలపై సరైన అవగాహన లేకపోతే మొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా చలికాలంలో గులాబీ మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే వసంతకాలం (Spring Season) వచ్చే సమయానికి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పూలను పూస్తాయి.
చలికాలంలో గులాబీ మొక్కలకు సరైన కత్తిరింపులు ఎలా చేయాలి?
సాధారణంగా చలి మొదలవగానే గులాబీ మొక్కలను పూర్తిగా కత్తిరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ అలా చేయడం మంచిది కాదు. చలికాలంలో కొమ్మలను అవసరమైనంత మాత్రమే కత్తిరించాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొదటి తీవ్రమైన మంచు (Hard Frost) పడిన తర్వాత మొక్క విశ్రాంతి దశలోకి వెళ్లినప్పుడు స్వల్ప కత్తిరింపులు చేయవచ్చు. అయితే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వంటి తక్కువ చలి ఉండే ప్రాంతాల్లో అమెరికా, యూరప్ దేశాల మాదిరిగా మంచు పడే సమయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. స్థానిక వాతావరణం, మొక్క పెరుగుదలను బట్టి కత్తిరింపుల సమయాన్ని నిర్ణయించాలి.
మొక్కలో ఎండిపోయిన, నల్లగా మారిన, వ్యాధులు సోకిన కొమ్మలను ముందుగా తొలగించాలి. ఒకదానికొకటి అడ్డంగా పెరుగుతూ రాపిడికి గురవుతున్న కొమ్మలను కూడా కత్తిరించడం మంచిది. గాలి బలంగా వీచినప్పుడు విరిగిపోయే అవకాశం ఉన్న పొడవైన కొమ్మలను కొంత మేర తగ్గించవచ్చు. అయితే ఆరోగ్యంగా ఉన్న కొమ్మలను ఎక్కువగా కత్తిరించకూడదు. ముఖ్యంగా పాకే గులాబీ మొక్కలు (Climbing Roses) విషయంలో భారీ కత్తిరింపులు చేయకుండా జాగ్రత్తపడాలి. అవసరమైన మేరకు మాత్రమే ఎండిన భాగాలను తొలగించాలి.
కత్తిరింపుల కోసం పదునైన కత్తిరింపు కత్తెర (Pruning Shears) ఉపయోగించాలి. కొమ్మను కత్తిరించేటప్పుడు బయటివైపు ఉన్న మొగ్గ (Outward-Facing Bud) కు కొద్దిగా పైన వాలుగా కట్ చేయాలి. దీనివల్ల కొత్త కొమ్మలు బయటివైపు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒక మొక్కకు ఉపయోగించిన కత్తెరను మరో మొక్కకు ఉపయోగించే ముందు శుభ్రం చేయాలి. దీనివల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
నీరు, శుభ్రత, మల్చింగ్తో మొక్క ఆరోగ్యాన్ని కాపాడండి
కత్తిరింపులతో పాటు మొక్క చుట్టూ పడిపోయిన ఆకులు, ఎండిన పూలు, వ్యాధిగ్రస్తమైన కొమ్మలను తొలగించాలి. వీటిని అలాగే వదిలేస్తే శిలీంధ్ర వ్యాధులు (Fungal Diseases), పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది. మొక్క మొదళ్ల చుట్టూ ఎండిన ఆకులు, కొబ్బరి పీచు లేదా సేంద్రియ పదార్థాలతో మల్చింగ్ (Mulching) చేయవచ్చు. ఇది నేలలో తేమ నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
చలికాలంలో నీరు ఎక్కువగా పోయడం కూడా మంచిది కాదు. నేల పైభాగం ఎండినప్పుడు మాత్రమే నీరు అందించాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ సమయంలో కొత్త పెరుగుదలను ప్రోత్సహించే నత్రజని ఎరువులు (Nitrogen Fertilizers) అధికంగా వేయకూడదు. మొక్క విశ్రాంతి తీసుకునే సమయంలో అనవసరంగా ఎరువులు వేయడం వల్ల కొత్త లేత కొమ్మలు బలహీనంగా పెరిగే అవకాశం ఉంది.
వసంతకాలంలో ఎక్కువ పూల కోసం ముందస్తు జాగ్రత్తలు
వసంతకాలంలో కొత్త చిగుళ్లు కనిపించడం ప్రారంభమైనప్పుడు మొక్కలకు తగిన పోషకాలు అందించాలి. సరైన కత్తిరింపులు, నీటి యాజమాన్యం, శుభ్రత పాటిస్తే గులాబీ మొక్కలు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఇంటి తోటను రంగురంగుల గులాబీలతో అందంగా మార్చుకోవచ్చు.







