30 నిమిషాల్లో ఇంట్లోనే హోటల్ స్టైల్ వెజ్ థాలీ రెసిపీ ఇలా!
హోటల్ స్టైల్ వెజ్ థాలీ.. ఇంట్లోనే 30 నిమిషాల్లో రుచికరమైన లంచ్ సిద్ధం..
మధ్యాహ్న భోజనానికి (Lunch) అన్నం, పప్పు, కూర మాత్రమే కాకుండా రకరకాల వంటకాలతో కూడిన పూర్తి భోజనం తినాలనిపిస్తుందా? అయితే రెస్టారెంట్ స్టైల్ వెజ్ థాలీ (Restaurant Style Veg Thali) ప్రయత్నించండి. హోటళ్లు, మెస్‌లలో లభించే ఈ భోజనంలో అన్నం, చపాతీ, రెండు రకాల కూరలు, పప్పు, రైతా, పచ్చడి ఇలా ఎన్నో రుచులు ఉంటాయి. అయితే ఇలాంటి థాలీని ఇంట్లో తయారు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒకేసారి కొన్ని పనులు చేసుకుంటే సుమారు 30 నుంచి 40 నిమిషాల్లోనే రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
వెజ్ థాలీకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రిపరేషన్
ఈ థాలీ తయారీకి అర కప్పు పెసరపప్పు (Moong Dal), అర కప్పు బాస్మతి బియ్యం (Basmati Rice), రెండు బంగాళాదుంపలు, ఒక కప్పు కాలీఫ్లవర్, అర కప్పు పచ్చిబఠానీలు, కొద్దిగా పనీర్ (Paneer), రెండు ఉల్లిపాయలు, మూడు టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర అవసరం. వీటితో పాటు చపాతీల కోసం గోధుమ పిండి, రైతా కోసం పెరుగు, బూందీ తీసుకోవాలి.
ముందుగా బియ్యాన్ని కడిగి కుక్కర్లో ఒక కప్పు నీరు, జీలకర్ర, కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి ఉడికించాలి. అదే సమయంలో మరో గిన్నెలో పెసరపప్పు, పసుపు, కొద్దిగా నెయ్యి, నీరు వేసి కుక్కర్లో ఉడికించుకోవచ్చు. ఇలా ఒకేసారి రెండు వంటకాలు సిద్ధమవుతాయి.
ఇవి కూడా చదవండి
ఒకే మసాలాతో పప్పు, కూరల తయారీ విధానం
తర్వాత బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, కసూరి మేతి వేసి వేయించాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. చివరగా టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మూడు భాగాలుగా విడగొట్టుకోవాలి. దీంతో మూడు కూరలకు వేర్వేరుగా మసాలా తయారు చేయాల్సిన అవసరం ఉండదు.
ఉడికించిన పెసరపప్పులో ఒక భాగం మసాలా మిశ్రమం, తగినంత నీరు, ఉప్పు వేసి కొన్ని నిమిషాలు మరిగిస్తే పప్పు సిద్ధమవుతుంది. మరో భాగం మసాలాలో బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. దీంతో ఆలూ గోబీ కూర (Aloo Gobi) తయారవుతుంది. మిగిలిన మసాలాలో పచ్చిబఠానీలు, పనీర్ ముక్కలు, నీరు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేస్తే మటర్ పనీర్ (Matar Paneer) కూర సిద్ధం.
థాలీని అందంగా సర్వ్ చేసే విధానం
ఇక పెరుగులో బూందీ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ,క్యారెట్ తురుము ,జీలకర్ర పొడి,కొత్తిమీర కలిపి రైతా ( Raita) తయారు చేసుకోవాలి. చపాతీలు కూడా కాల్చుకోవాలి. చివరగా పెద్ద ప్లేట్లో జీరా రైస్ (Jeera Rice), పప్పు, రెండు కూరలు, చపాతీలు, రైతా, సలాడ్, పచ్చడి, అప్పడం (Papad) అందంగా సర్దుకోవాలి. అంతే.. ఇంట్లోనే హోటల్ స్టైల్ మెస్ థాలీ సిద్ధం. ఒకే భోజనంలో రకరకాల రుచులను ఆస్వాదించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా లంచ్ తయారు చేయాలన్నా ఈ థాలీని ప్రయత్నించవచ్చు.







