కరోనాపై ‘కొవాగ్జిన్’ సూపర్ ఫైటింగ్!

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ప్రజలందరికీ టీకాలు అందించడం ద్వారా వైరస్ ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొంతమందికి అనుమానాలున్నాయి. నిన్నమొన్నటివరకూ టీకా వేయించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. వైద్యరంగంలో పనిచేసే వాళ్లు కూడా టీకాపై అయిష్టత ప్రదర్శించారు. అయితే వ్యాక్సిన్లపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొవాగ్జిన్ సమర్థతపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
మన దేశంలో రెండు టీకాలు తయారవుతున్నాయి. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ టీకా తయారు చేస్తుండగా.. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఇందులో కొవాగ్జిన్ టీకా భేషుగ్గా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. సాధారణ వేరియంట్ పైనే కాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ పైన కూడా కొవాగ్జిన్ అద్భుతంగా పని చేస్తోందని.. సార్స్ కోవ్ 2 కు చెందిన వేర్వేరు రూపాలను ఇది నిర్వీర్యం చేస్తోందని వెల్లడించింది. వాస్తవానికి ఈ టీకాను భారత్ బయోటెక్ తో కలిసి ఐసీఎంఆర్ అభివృద్ధి చేసింది.
దేశీయంగా కొవాగ్జిన్ టీకాకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాని మొదలు ప్రముఖులంతా ఈ టీకానే వేసుకోవడంతో కొవాగ్జిన్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అయితే దేశీయంగా తయారుకావడంతో ఇది పెద్దగా పని చేయకపోవచ్చనే అనుమానాలు ఉండేవి. అయితే ప్రపంచంలో మిగిలిన టీకాలకు ఏమాత్రం తీసిపోకుండా.. వాటికంటే మిన్నగా కొవాగ్జిన్ టీకా పనిచేస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. దేశీయంగా ఇప్పుడు డబుల్ మ్యుటెంట్ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దీనిపైన టీకాలు పని చేయకపోవచ్చని అందరూ అనుమానించారు. అయితే దేశీయంగా విస్తృతంగా వ్యాపిస్తున్న డబుల్ మ్యుటెంట్ తో పాటు యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లను సైతం కొవాగ్జిన్ అద్భుతంగా ఢీకొంటోందని తేల్చేసింది.
అయితే టీకా తీసుకున్నవాళ్లకు కూడా కరోనా మళ్లీ సోకుతోంది. కొవాగ్జిన్ టీకా తీసుకున్నవాళ్లలో 0.04శాతం మందికి, కోవిషీల్డ్ తీసుకున్నవాళ్లలో 0.03శాతం మందికి మళ్లీ కరోనా సోకింది. అయితే వీళ్లెవరూ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లలేదు. సురక్షితంగా బయటపడ్డారు. కాబట్టి టీకా తీసుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినా.. ప్రాణాంతకంగా మారదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్నా కూడా కొన్నాళ్లపాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.