ఆ వార్తల కట్టడికి మరింత సమయం
ఫేస్బుక్లో నకిలీ వార్తలు, వదంతులను అరికట్టేందుకు తమకు మరికొంత సమయం అవసరమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. దాదాపు 8.7 కోట్ల మంది అమెరికన్ల ఫేస్బుక్ వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా తస్కరించిన వ్యవహారంలో ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన ఆయన కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నకలు ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జుకర్బర్గ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఫేస్బుక్లో నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తిచేస్తున్న పేజీలను 2017 నుంచి తొలగిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ 2019 వరకు కొనసాగినా ఇలాంటి అకౌంట్లను పూర్తి స్థాయిలో తొలగించలేమని వెల్లడించారు.
ఈ వందతులు, నకిలీ వార్తల పేజీలను తొలగించేందుకు తమకు మరికొంత సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు. తమ ప్లాట్ఫామ్ ద్వారా ఒక దేశపు ఎన్నికలకు మరో దేశం ప్రభావితం చేయకుండా, యూజర్ల సమచారంపై వారికి మరింత అధికారం ఉండేలా, విద్వేష వ్యాఖ్యలు, దూషణల నుంచి ప్రజలను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా యూజర్ల గోప్యత, ఎన్క్రిప్షన్, భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు, యూజర్ల సమాచార నిర్వహణ, ఎన్నికల్లో ఫేస్బుక్ దుర్వినియోగం కాకుండా తీసుకున్న చర్యలు సహా పలు అంశాలపై సవివరణ నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.













