స్మార్ట్ ఫోన్ తో మెడనొప్పి!
నేడు మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది అంతర్భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్న 340 కోట్ల మందిలో చాలామంది మెడపై ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టెక్ట్స్ నెక్ గా పిలిచే ఈ పద్ధతిలో సందేశాలు పంపే సమయంలో వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందని, మెడ సహజ వంపును కూడా ఇది దెబ్బతీస్తుందని, దీంతో మృదు కణాలు అసౌకర్యానికి గురవుతాయని థాయ్‌లాండ్‌లోని ఖోన్ కయెన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు. పరిశోధనల్లో భాగంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో రోజుకు ఎనిమిది గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌లో గడిపే వారిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారిలో 32 శాతం మంది మొడ నొప్పి, 26 శాతం మంది భుజం నొప్పి, 20 శాతం మంది వెన్నునొప్పి, 19 శాతం మంది మణికట్టు నొప్పి వస్తున్నట్టు వెల్లడించారు.













