Frisco: ఫ్రిస్కోలో యార్లగడ్డకు ఘన సన్మానం
అమెరికాలో, ఇండియాలో తన సాహిత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, పద్మశ్రీ-పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) ను ఫ్రిస్కో (Frisco) లో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. టెక్సాస్ రాష్ట్రంలో ఆయనకు అరుదైన గౌరవం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, దక్షిణ-ఉత్తర భారతదేశాల వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతెయ ఐక్యతను పెంపొందించినదుకు గానూ టెక్సాస్ రాష్ట్రంతో పాటు ఆ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ వీధిబడి చెప్పి డబ్బులు సంపాదించే ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించిన తనకు ఆకలి విలువ తెలుసని, కట్టెలు కొట్టి పుస్తకాలు కొనుక్కున్న తాను 1972 ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభించి ఇప్పటి వరకు కొన్ని వేల సమావేశాల్లో మాట్లాడినప్పటికీ ఇలాంటి అరుదైన గౌరవం తనకు ఎదురై మాటలు రాని సందర్భం ఇదే ప్రప్రథమని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు, టెక్సాస్ రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన వక్తలు యార్లగడ్డ వ్యక్తిత్వం, సాధించిన విజయాలు, అజాతశత్రువుగా సాయపడే లక్షణాలు వంటి వాటిని కీర్తించి ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పొనంగి, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, ఉదయగిరి రాజేశ్వరి, మాధవి లోకిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. తుమ్మల చైతన్య, చినసత్యం వీర్నపు, కాకర్ల విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.







