టెక్సాస్ లో విప్రో కేంద్రం
టెక్సాస్ రాష్ట్రంలో ఓ సాంకేతిక కేంద్రాన్ని విప్రో ప్రారంభించింది. ఇదే రాష్ట్రంలో డల్లాస్, హూస్టన్లోనూ ఇప్పటికే కంపెనీకి సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించడంతో టెక్సాస్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,400 నుంచి 2000కి పెంచుకునే యోచనలో విప్రో ఉంది. తన క్లయింట్లకు అత్యున్నత, వర్థమాన సాంకేతికతలకు సంబంధించి సామర్థ్యాల అభివృద్ధిపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ అనలాటిక్స్కు ప్రధాన కేంద్రంగా కూడా ఇది సేవలు అందిస్తుందని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. 45000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా తొలుత 150 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. రానురాను కార్యకలాపాల విస్తరణకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నామని వెల్లడించింది.













