విప్రో చైర్మన్‌కి అరుదైన గౌరవం
విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన కార్నీజ్ సంస్థ ఆయన్ను సత్కరించనున్నది. దాతృత్వ కేటగీరిలో ఈ ఏడాది కార్నీజ్ మెడల్‌ను ప్రేమ్‌జీ సొంతం చేసుకున్నారు. భారత్‌లో ప్రభుత్వ పాఠశాల వ్వవస్థ సంస్కరణకు విశేష కృషి చేసిన ప్రేమ్జీనీ ఈ అవార్డు వరించింది. కార్నీజ్ మెడల్‌కు ఈసారి తొమ్మిది మందిని ఎంపిక చేశారు. అందులో 70 ఏళ్ల ప్రేమ్‌జీ ఉన్నారు. తమ సంపదను దానం చేసి సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి కార్నీజీ మెడల్‌ను ప్రదానం చేస్తారు. విప్రోను అగ్రస్థానంలో నిలిపిన ప్రేమ్‌జీ ఆ తర్వాత తన దృష్టిని భారతదేశంలో ఉన్న ప్రభుత్వ విద్యావ్యవస్థపైన పెట్టారని కార్నీజీ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ మొత్తం ఏడు రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల స్కూళ్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్నది. ప్రేమ్‌జీ సంస్థ 2011లో యూనివర్సిటీని కూడా స్థాపించింది. అందులో చదువుకునే 46 శాతం మంది గ్రామీణభారతం నుంచే వస్తారు. ఈ ఏడాది కార్నీజ్ అవార్డు గెలుచున్నవారిలో మీ హింగ్ చాక్, జూలియన్ రాబర్ట్సన్, జెఫ్ స్కోల్ ఉన్నారు. కార్నీజ్ మెడల్‌ను 2001లో మొదలుపెట్టారు. ప్రతి రెండేళ్లకు ఈ అవార్డులను ఇస్తారు. అక్టోబరులో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.













