వారికి పౌరసత్వం లభించేలా చూస్తా – బైడెన్
అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న వారిపై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వరాలజల్లు కురిపించారు. తాను అధికారంలోకి వస్తే.. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారికి.. పౌరసత్వం ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందితే అమెరికాను ఇమ్మిగ్రేషన్ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. అమెరికాలో ప్రస్తుతం 11 మిలియన్ల మంది విదేశీయులు నిబంధనలు ఉల్లంఘించి నివసిస్తున్నట్లు వెల్లడించారు. వారికి అమెరికా పౌరసత్వం కల్పించేందుకు ఓ బిల్లును రూపొందించి, దాన్ని ప్రతినిధుల సభ, సెనేట్‌కు పంపుతానన్నారు. అంతేకాకుండా అమెరికాలో కరోనాను కట్టడి చేసి, ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికాను గట్టేక్కించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.













