మేరీల్యాండ్ కాల్పులను ఖండించిన వైట్‌హౌస్
మేరీల్యాండ్‌లోని అన్నాపోలీస్‌లో క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయంపై జరిగిన కాల్పులను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నారు. వారిపై దాడిచేయడమంటే ప్రతి అమెరికన్‌పైనా దాడిచేయడమే అని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ శారా సాండార్స్ వ్యాఖ్యానించారు. ఐదుగురిని బలితీసుకున్న ఈ ఘటనపై ఆమె ట్విటర్ల్ స్పందిస్తూ, అన్నాపోలీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ బాధ్యతలు నిర్వహిస్తున్న అమాయకులైన జర్నలిస్టులపై హింసాత్మకంగా దాడికి పాల్పడడం అవివేకం. ఇది అమెరికాలోని ప్రజలందరిపైనా జరిగిన దాడి. బాధితులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు.
క్యాపిటల్ గెజిట్‌పై జరిగిన దాడి విషాదకర దుశ్చర్య అంటూ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. ఇది అతి క్రూరమైన, అవివేకమైన చర్యగా అభివర్ణించిన ఆమె, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాటు, సహోద్యోగులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.













