ఫేక్ న్యూస్ సమాచారమిస్తే 50 వేల డాలర్లు
వాట్సాప్‌లో వ్యాపి చెందుతున్న తప్పుడు సమాచారం ఇండియలో పలువురి హత్యకు కారణం కావడంతో దీనికో పరిష్కారం ఆలోచించింది ఆ సంస్థ. తప్పుడు సమాచారం, ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారి సమాచారం ఇస్తే 50 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించింది. ఈ అవార్డు పొందిన ప్రతి ఒక్కరి మేధోసంపత్తి, వారి సమాచార విశ్లేషణ వాళ్ల పేరుపైనే ఉంటుంది. వాట్సాస్ సిబ్బంది కేవలం సూచనలు మాత్రమే ఇస్తారు. మిగతా పని అంతా యూజర్లే చేసుకోవాల్సి ఉంటుంది అని వాట్సాప్ రీసెర్చ్ అవార్డ్స్ ఫర్ సోషల్ సైన్స్ అండ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల వారి ఎంపిక విధానం, ఇతర నిబంధనలను సంస్థ విడుదల చేసింది.
వాట్సాప్ ప్రధాన సమాచార వనరుగా ఉన్న ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికోలాంటి దేశాల వాళ్లకు ప్రాధానత్య ఇస్తారు. అవార్డులు గెలుచుకున్న వారికి వాట్సాప్ నిర్వహించే రెండు వర్క్‌షాప్‌లకు హాజరయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నది. పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగులు తిరుగుతున్నాయంటూ వాట్సాప్‌లో వ్యాప్తి చెందిన సమాచారం దేశంలో పలువురి హత్యకు కారణమైన విషయం తెలిసిందే. దీనిపై వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి బాధ్యత వహించాల్సిందిగా భారత ప్రభుత్వం వాట్సాప్‌ను కోరాగా ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది.













