ఫ్రీమాంట్లో ఎఫ్ఓజి పెరెడ్…వేటా శకటానికి బహుమతి
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ వేడుకలను శాన్ఫ్రాన్సిస్కోలోని ఫ్రీమాంట్లో ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 20న ఫెస్టివల్ అఫ్ గ్లోబ్ (ఎఫ్ఓజి) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పెరెడ్లో ఎన్నో సంఘాలు, నాయకులు పాల్గొని దేశభక్తిని చాటారు. స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేట్టుగా ముస్తాబు చేసిన శకటాలను నగర వీధుల్లో ఊరేగించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)వారు రూపొందించిన శకటం అందరినీ ఆకర్షించింది. భారతీయ మహిళా శక్తిని లోకానికి తెలియ చెప్పిన ‘‘రాణి రుద్రమ దేవి’’తో పాటు వివిధ రంగాలలో రాణించి భారతావనికి కీర్తి తెచ్చిన మహిళా నాయకులైన ‘‘ఇందిరా గాంధీ’, ప్రతిభ పాటిల్, మదర్ థెరెసా, ప్రియా ఝనగం, కిరణ్ బేడీ, కల్పనా చావ్లా ప్రతిబింబాలు/ప్రతిమలతో అలంకరించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. మహిళల కోసం పాటుపడుతున్న వేటా సంస్థ చేసిన సేవా కార్యక్రమాలను, ఆకట్టుకునేలా శకటాన్ని రూపొందించినందుకు అవార్డును నిర్వాహకులు అందజేశారు. ‘‘బెస్ట్ కమ్యూనిటీ సేవ’’ అవార్డును వేటా నాయకులు గెలుచుకున్నారు. ఈ వేటా ఈ శకటంలో వివిధ నాయకుల వేషధారణలో కనిపించిన చిన్నారులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించడానికి దాదాపు 2 వేల మంది ఆహుతులు వచ్చారు. తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే ‘‘మహిళ సాధికారతే ‘‘లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన రaాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను రెండు సంవత్సరాల క్రింద ఉత్తర అమెరికాలో , ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను(క్రియేటివిటీ) పెంచి వారి కలలను సాకారం చేసుకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలనే ఉద్దేశ్యంతో ఝాన్సీ రెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది. ఈ వేడుకలలో వ్యవస్థాపక ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, సలహా కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ సభ్యులు అనురాధ, హైమ, పూజ , విశ్వ, మీడియా చైర్ సుగుణ రెడ్డి, కల్చరల్ చైర్ రత్నమాల వంకతో పాటు సరోజ మంగ, శైలజ గిలేలా, సునీత గంప, చందన రెడ్డి, మాధురి రెడ్డి, దివ్య, భువన్ వేమిరెడ్డి, వినీత్ తదితరులు పాల్గొన్నారు.













