తెలంగాణ ఎన్నారై వెంకట్ ఎక్కా ఆవేదన…
డిట్రాయిట్లో ఉంటున్న తెలంగాణవాసి వెంకట్ ఎక్కా తెలంగాణపై ఉన్న అభిమానంతో ప్రత్యేక రాష్ట్రం వస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో కెసీఆర్, ఇతర తెలంగాణవాదులు చేసిన పోరాటానికి తన మద్దతును తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రగతి కోసం తనవంతుగా తోడ్పాటును అందించారు. అమెరికాలో తెలంగాణవాసుల కోసం ఏర్పడిన జాతీయ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘంలో కూడా ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలికాలంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదన చెంది ఈ కవితను వెంకట్ ఎక్కా తెలుగుటైమ్స్ కు పంపించారు. ఆయన రాసిన కవితను ఇక్కడ ప్రచురిస్తున్నాము.
ఐపాయ్
అరవై ఏళ్ల నిరంతర పోరాటం
ఆరు వందల ఆత్మ హత్యల హారం
నీళ్లు, నిధుల నిందలతో
తెలంగాణా శంఖారావం
అర్ధరాత్రి ఢిల్లీ రాయభారం
దొరగారికి పట్టాభిషేకం
మాటల మాంత్రికుడి గుప్పిట్లో సర్వం సమర్పణం
ఆయన చెప్పినదే వేదం ఆయన చేసిందే హోమం
దిగ్విజయంగా కాళేశ్వరం
కోటి ఎకరాల ఆయకట్టుకు పురోగమనం
ఇంటింట భగీరథునికి ఆహ్వానం
హైదరాబాద్ ఆపిల్ గూగుల్ అమెజాన్ లకు పెద్ద పీఠం
దొర కళ్ళకి దురాశ పొరలు
ధృతరాష్ట్రుని పుత్ర వాత్సల్యాలు
కల్వకుంట్ల చాణక్యుడి రాజకీయం
తన పర బేధం లేకుండ
పార్టీల సంత లొ కొనుగోలు కార్యక్రమం
ఎవరి బేరాలు వారివి
ఎవరి వాటాలు వారివి
బలైపోయిన అమరవీరులు
తిరిగి భగవంతునితో విన్నపాలు
తప్పయింది తిరిగి తెలంగాణాకి
పంపమని ఆర్తనాదాలు
బంగారం లాంటి దేహం పెట్రోలు తో దహనం,
దొర అరవై ఎకరాల ఫార్మహౌస్ దాని ఫలితం
ఇంటికో ఉద్యోగ వాగ్దానం అకస్మాత్తుగా మాయం
తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు మాత్రం ఖాయం
పేదల డబుల్ బెడ్రూములు కాలేదు తయారు
కానీ పెద్ద సార్ కి మాత్రం ప్రగతి భవనం ఖరారు
మీ ఖర్మ మీది మా పాలన మాది
ఎన్నికలకు గల్లీ గల్లీకి డబ్బు పంపకం
ఈరోజు గడిస్తే చాలు అన్నది వోటర్ వాలకం
తిరిగి భవనం లోకి దొరగారి ప్రవేశం
మళ్ళీ ఐదేళ్లకే పునః దర్శనం.
– వెంకట్ ఎక్కా













