ఉపరాష్ట్రపతికి అరుదైన గౌరవం
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం లభించింది. మార్షల్ టిటో- పండిట్ జవహర్లాల్ నెహ్రూ గౌరవార్థం బెల్ గ్రేడ్లోని సెర్బియా పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ పార్లమెంట్లో ప్రసంగించిన భారతీయుడు వెంకయ్యే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి విషయంలో కొత్త పోకడల కోసం భారత్, సెర్బియా చేసిన కృషి, స్నేహం భేషైనవని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య ఉన్నతమైన సంబంధాలున్నాయని, భారతదేశం స్వాతంత్య్రం పొందిననాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాల పట్ల ఇరుదేశాలు కలిసి స్పందించిన తీరు, ప్రపంచంలో ప్రజాస్వామ్య భావనకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. ఒకేమాట మీద నిలబడిన భారత్- సెర్బియాల స్నేహాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్లో విభిన్న భావ సారూప్యతల మధ్య, భిన్న విషయాలపై ప్రజామోద విధానాల్లో ప్రభుత్వం స్పందిస్తోందని అన్నారు. 1961లో ఇదే వేదికపై నెహ్రూ ఇచ్చిన సందేశం గొప్పదనాన్ని ప్రత్యేకంగా వివరించారు. భాగస్వామ్య అభివృద్ధిలో ప్రజాస్వామ్య ప్రాధాన్యాన్ని గురించి తెలిపారు.













