ఎన్నారైవిఎ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ కార్యక్రమం
అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఎన్నారైవీఏ, అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న ఆ సంస్థ చాప్టర్స్ ఆధ్వర్యంలో వాసవీ ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవీ మాత త్యాగం, ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ వేలాది కుటుంబాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వాసవీ మాత, మాతతోపాటుగా ఆత్మార్పణ చేసిన 102 గోత్రాల దంపతులనును స్మరిస్తూ ప్రత్యేక పూజలు, ఊరేగింపు, హోమాలు, వాసవీ మాత చరిత పఠనం, తులాభారం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ వాసవీ మాత, 102 గోత్రాల దంపతుల త్యాగాలను వివరించారు.
‘ఈ ఏడాది వాసవీ ఆత్మార్పణ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది’ అని ఎన్నారైవీఏ అధ్యక్షులు శ్రీనివాస పందిరి చెప్పారు. వాసవీ మాత త్యాగాలకు గుర్తుగా ఈ నెలరోజుల పాటు పలు ప్రాంతాల్లో తమ సంస్థ ప్రతినిధులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. వాసవీ మాత సందేశాల్లో త్యాగం, శాంతి, కలిసి బతకడం వంటి కీలకమైన విలువలను నిలబెట్టేలా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ‘శాంతి, సుహృద్భావాన్ని ఇలా వాసవీ కమ్యూనిటీ ప్రచారం చేయడం ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంది. వాసవీ మాత మనకు నేర్పించిన పాఠాలు ఎంతో గొప్పవి. ఇలా చేసే కార్యక్రమాలు వాటిని ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో శాంతి స్థాపనకు ఉపయోగపడతాయి’ అని శ్రీనివాస్ చెప్పారు. అలాగే ఎన్నారైవీఏ చాప్టర్స్ ఎప్పటికీ వాసవీ మాత విలువలను కాపాడేందుకు పనిచేస్తుందని, వాసవీ ఆత్మార్పణ-2024 విజయవంతం అవడం ఈ కమ్యూనిటీ నమ్మకానికి ప్రతిక అని వివరించారు.
సెయింట్లూయిస్, సాల్ట్ లేక్ సిటీ, కొలంబస్, కనెక్టికట్, డిట్రాయిట్, క్లీవ్ లాండ్, అస్టిన్, శాన్ ఆంటోనియో, మేరీలాండ్, బోస్టన్, అట్లాంటా, వర్జీనియా, వాషింగ్టన్ డీసి, డెన్వర్, ఛార్లెట్, రిచ్ మాండ్లోని ఎన్నారై విఎ ఛాప్టర్స్ ఆధ్వర్యంలో ఈ వాసవీమాత ఆత్మార్పణ కార్యక్రమాలు జరిగాయి.







