అమెరికా మహిళ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే
అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్ అరుదైన రికార్డు సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఆమెకు 11.8 అంగుళాల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు. గతంలో అదే దేశానికి చెందిన వివాన్ వీలర్ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును (10.4 అంగుళాలు) తాజాగా ఎరిన్ హనీకట్ అధిగమించారు. మిషిగాన్‌కు చెందిన హనీకట్‌కు బాల్యం నుంచే జన్యుపరమైన సమస్యలు ఉండేవి. 13 ఏళ్లు వచ్చే సరికి ఆమెకు క్రమంగా గడ్డం రావడం మొదలైంది. తొలుత ఆందోళన చెందిన హనీకట్ రోజుకు మూడు నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేవారు. అవాంచిత రోమాలను తొలగించే రకరకాల లేపనాలను వాడినా ప్రయోజనం లేకపోయింది. కొన్నాళ్ల తర్వాత విపరీతమైన రక్తపోటుతో కంటి స్ట్రోక్ వచ్చి పాక్షికంగా దృష్టిని కోల్పోయారు. అక్కడి నుంచి షేవ్ చేయడం, హెయిర్ రిమూవల్స్ వాడటం మానేశారు. దీంతో గడ్డం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో మానసిక సంఘర్ణణ మొదలైంది. ఇంటినుంచి బయటకి రాలేక కొన్నాళపాటు నరకం అనుభవించారు. ఆమె పరిస్థితిని గమనించిన స్నేహితులు, బంధువులు గడ్డం ఉంటే తప్పేంటి. ఇలా ఇంకా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించేవారు. క్రమంగా ఆందోళన వీడిన ఆమె గడ్డం పెంచడంపై దృష్టి పెట్టారు. అదే ఈ రోజు ప్రపంచ రికార్డు సాధించేలా చేసింది.













