Washington: డాలర్ డ్రీమ్స్ లో బతకొద్దు… అమెరికా వీసాలపై భారతీయ విద్యార్థుల అనాసక్తి.!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) .. విదేశీ విద్యార్థులపై అనుసరిస్తున్న కఠినవైఖరి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చాలా మందిని డిపోర్టేషన్ చేసేశారు కూడా. దీనికి మనదేశమేమీ అతీతం కాదు… భారతప్రధాని మోడీ (Modi) తమకు చాలా సన్నిహితుడని.. భారత్ మిత్రదేశమంటూనే, ఎక్కడా ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. ఈఅంశాన్ని భారతీయ విద్యార్థులు, వారి కుటుంబాలు చాాలా నిశితంగా గమనించాయి. దీంతో ఈసారి అమెరికా వీసాలకోసం భారతీయ విద్యార్థులు ఎగబడడం లేదు.
భారతీయ విద్యార్థులు ఈసారి సీజన్ ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో అమెరికా వీసాలు తీసుకొన్నారు. అమెరికా విదేశాంగశాఖ డేటా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. గతేడాది మార్చి-మే మధ్య సీజన్‌తో పోలిస్తే ఈయేడాది 27శాతం తగ్గాయి. వాస్తవానికి కొవిడ్ సీజన్‌లో కన్నా ఇవి తక్కువ కావడం గమనార్హం. ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య సెమిస్టర్ ఉండటంతో సాధారణంగా విద్యార్థి వీసాలకు సంబంధించి మార్చి-జులై మధ్య సీజన్ చాలా బిజీగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం మార్చి-మే మధ్యలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్-1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. కొవిడ్ తర్వాత ప్రయాణాలు పునఃప్రారంభించిన 2022లో ఇదే సీజన్‌లో 10,894గా నమోదయ్యాయి. ఇక 2023లో 14,987, 2024లో 13,478 జారీ అయ్యాయి.
వాస్తవానికి 2023-2024 సంవత్సరానికి విద్యాభ్యాసం కోసం అమెరికాకు వచ్చిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో చైనీయులు టాప్‌లో ఉండగా.. వారిని మనవాళ్లు దాటేశారు. ఈ విషయం ఓపెన్ డోర్స-2024 డేటా వెల్లడిస్తోంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌పై ట్రంప్ కార్యవర్గం చర్యలకు ఉపక్రమించడం, పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థుల వీసాలు రద్దు చేయడం వంటి చర్యలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. అక్కడ చర్యలను ఎదుర్కొన్నవారిలో భారత విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. దీనికితోడు మే 27-జూన్ 18 వరకు కఠినమైన సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ కోసం రెండు వారాలు వీసా అప్లికేషన్లను నిలిపివేయడం సంఖ్య తగ్గడానికి కారణం అయ్యాయి.
తాజాగా అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘మా జాతీయ భద్రత, ప్రజల రక్షణకు వీసా జారీ ప్రక్రియ కీలకం. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలి. మా ఓవర్సీస్ పోస్టులు నాన్ ఇమిగ్రెంట్ వీసాల షెడ్యూలింగ్‌ను మొదలుపెట్టాయి. అభ్యర్థులు ఆయా దౌత్య కార్యాలయాల్లో అపాయింట్‌మెంట్లను వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలి. అమెరికాకు వారి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని ధ్రువీకరించుకొనేందుకు వీసా దరఖాస్తులకు పూర్తిగా వెట్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడంపైనే పని చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.







