హెచ్1బి వీసా దరఖాస్తు షెడ్యూల్
అమెరికా హెచ్-1బీ దరఖాస్తు ప్రక్రియకు ముహూర్తం నిర్ణయించారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుంచి హెచ్-1బీ వీసాల దరఖాస్తులు స్వీకరించనున్నట్టు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. వార్షిక లాటరీ విధానంలో భారీ మార్పులు తీసుకువచ్చినట్టు వెల్లడించింది. ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా.. వాటన్నింటినీ పాస్‌పోర్టు ఆధారంగా ఒకే దరఖాస్తుగా పరిగణించనున్నట్టు తెలిపింది. దీనివల్ల నకిలీలను గుర్తించడం, మోసాలను కట్టడి చేయడం వంటివి సులువవుతుందని ఫెడరల్ ఏజెన్సీ పేర్కొంది.
ఎవరైనా ఒక వ్యక్తి వివిధ కంపెనీల్లో పనికోసం.. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెట్టినట్టయితే.. వాటిని పాస్‌పోర్టు నెంబరు ఆధారంగా ఒకే దరఖాస్తుగా పరిగణించనున్నారు. నకిలీలను అరికట్టే ప్రధాన లక్ష్యంతో నూతన విధానాన్ని తీసుకువచ్చినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. దీంతో అర్హులైన దరఖాస్తు దారులందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి వీసా మంజూరు వరకు అన్నీ ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతాయని యూఎస్ సీఐఎస్ వివరించింది. దరఖాస్తు దారులు ఖచ్చితంగా యూఎస్ సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్లో రిజిస్టర్ చేసుకుని.. తర్వాత ప్రక్రియ ప్రారంభించాలని, చెల్లింపులు కూడా దాని నుంచే చేయాలని సూచించింది. కంపెనీలకు సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 28నే ప్రారంభించనున్నట్టు తెలిపింది.
వీసాల జారీ ప్రక్రియ అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. విభిన్న రంగాల్లోని నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏటా పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలు ఇస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 65 వేల వీసాలు మంజూరు చేస్తుంది. దీంతో పాటు యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేద్దామనుకునే వారి కోసం మరో 20వేల హెచ్1-బీ వీసాలు అందిస్తుంది. అమెరికా ఏటా జారీ చేసే ఈ వీసాల్లో 70 శాతానికి పైగా భారతీయ అభ్యర్థులే దక్కించుకోవడం విశేషం.







