భారీగా పెరిగిన అమెరికా వీసా ఫీజులు..
ఐటీ కలల స్వప్నం… డాలర్ డ్రీమ్స్ స్వర్గం అమెరికా.. పై చదువుల కోసమో.. ఐటీ ఉద్యోగాల కోసమో ఏటా వేలాదిమంది భారతీయులు.. అమెరికా చేరుకుంటున్నారు. అక్కడే తమ జీవితాన్ని వెతుక్కుంటున్నారు. ఆదేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. అయితే అలాంటి వారికి అమెరికా సైతం అంతే తోడ్పాటు అందిస్తోంది. దీంతో అమెరికా వెళ్లే వారి సంఖ్య ఏటేటా మరింత పెరుగుతూ వస్తోంది. కానీ కొత్త నిబంధనలు మాత్రం.. భారతీయుల కలల్ని కల్లలు చేసేలా కనిపిస్తున్నాయి.
అమెరికా వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది. కొలరాడో జిల్లా కోర్టు జడ్జి షార్లెట్ ఎన్ స్వీనీ మార్చి 29న ఓ కేసులో తీర్పు చెపుతూ ‘కొత్త ఫీజుల అమలును అడ్డుకోవద్దు’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తీర్పు అనంతరం యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ .. వివిధ రకాల వీసాల ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐటీ ఉద్యోగులకు కంపెనీలు స్పాన్సర్ చేసే హెచ్ 1బీ వీసా ఫీజు గతంలో 460 యూఎస్ డాలర్లు (రూ.38 వేలు) ఉండేది. ఇప్పుడు అది 780 యూఎస్ డాలర్లకు (రూ.64,000) పెరిగింది. అలాగే దరఖాస్తు ఫీజు 10 అమెరికన్ డాలర్లు (రూ.829) నుంచి ఏకంగా 215(రూ.17,000) డాలర్లకు పెరిగింది. ఇది టెక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఉద్యోగులను ఇతర దేశాల నుంచి అమెరికాకు బదిలీ చేయడానికి ఉపయోగించే ఎల్ 1 వీసా చార్జీల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. దీని ఫీజు 460 అమెరికన్ డాలర్లు (రూ.38,000) లనుంచి 1,385 డాలర్లకు (రూ.1,10,000)లకు పెరిగింది. అలాగే ఇన్వెస్టర్ వీసా ఈబీ 5 ఫీజులో పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. గతంలో ఇది 3,675 అమెరికన్ డాలర్లు (రూ.3 లక్షలు) ఉంటే అది ఇప్పుడు 11,160 డాలర్లు(9 లక్షలు)కు పెరిగింది. అమెరికాలో నివాసం ఉండాలనుకునే భారతీయులను ఇవి ప్రభావితం చేయనున్నాయి.







