అమెరికా దళాలు వెళ్లిపోతాయి… మేము ఇక్కడే కొనసాగుతాం
సిరియాను వీడి ఇరాక్ మీదుగా స్వదేశానికి వెళ్తున్న అమెరికా సైనిక దళాలు తమ దేశంలో ఏమీ ఉండబోవని, నాలుగు వారాల్లో అవి వెళ్లిపోతాయని ఇరాక్ రక్షణ మంత్రి నజ్జా అల్ షామారి తెలిపారు. సిరియాను వదిలి వెళ్తున్న అమెరికా దళాలు తమ దేశంలో ఉండటానికి అనుమతి లేదని చెప్పారు. ఇరాక్ పర్యటనలకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎస్పర్ మాట్లాడుతూ సిరియా నుంచి అమెరికా దళాలలను వెనక్కి రప్పించడం కొనసాగుతుందని, అయితే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదా కార్యకలాపాలు విస్తరించకుండా ఉండేందుకు తమ దళాలు ఇరాక్ నుంచి పనిచేస్తాయని తెలిపారు. వీరిద్దరి ప్రకటనలు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ సిరియా నుంచి అమెరికా దళాలను వెనక్కి రప్పిస్తున్నప్పటికీ కొన్ని బలగాల మోహరింపును మాత్రం ఆ దేశంలోని ఇంధన ప్రాంతాల్లో కొనసాగిస్తామని పేర్కొన్నారు.













