భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థులను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తన వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది.
ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తుదారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి, అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్ 19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్ 1బీ సహా, ఇతర రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.













