అగ్రరాజ్యంలో 7 లక్షల కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 7 లక్షలు దాటిపోయింది. 37 వేల మందికి పైగా మరణించారు. మొత్తం 7,12,399 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలోనే 2,622 మంది మృతిచెందారు. రికార్డు స్థాయిలో 37 లక్షలపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చిమ్మ చీకటిలో చిక్కుకున్న అమెరికా.. కాంతిరేఖకు అతి సమీపంలోనే ఉందని భరోసా ఇచ్చారు. తెలివైన అదృశ్య శక్తితో పోరాటం చేస్తున్నామని, ఇందులో అమెరికా శాస్త్రీయ పరిజ్ఞానానిదే అంతిమ విజయమని నొక్కిచెప్పారు. కరోనా వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ ఫ్యాక్స్ న్యూస్ ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. దీనిని కనిపెడతామని ట్రంప్ అన్నారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని నిర్ణయింంచడంతో క్రైస్తవ, యూదు, ఇస్లామిక్ మతపెద్దలతో ట్రంప్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగానికి 1900 కోట్ల డాలర్ల ఉద్దీపన పథకాన్ని ట్రంప్ ప్రకటించారు.













