భారతీయులపై ట్రంప్ దృష్టి మారింది…
భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలి అమెరికా పర్యటన సత్ఫలితాలను ఇచ్చినట్లే కనిపిస్తోంది. మోదీ పర్యటన తరువాత అక్కడ జరుగుతున్న పరిణామాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ చర్చల ఫలితంగా చర్యలు కూడా అత్యంత వేగంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ అమెరికా పర్యటన ముగిసి పది రోజులు కూడా కాకముందే, చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి అమలులోకి వచ్చే ప్రక్రియ మొదలైంది. అమెరికాలో భారతీయుల ప్రవేశానికి మార్గం సుగమం చేయడం కోసం భారత్ అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. అంతగా హానికరం కాని ప్రయాణికులను ఆట్టే ఇబ్బంది పెట్టకుండా, ఎయిర్‌పోర్టులో పెద్దగా తనిఖీలు లేకుండా త్వరితంగా తమదేశంలోకి రానివ్వడం కోసం అమెరికా అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ విభాగం గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకానికి భారత్ తరపున మొట్టమొదటగా అమెరికా భారత రాయబారి అయిన నవ్‌తేజ్ శర్ణా దరఖాస్తు చేశారు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ద్వారా వెళితే పెద్దగా ఇబ్బందులుండవని ఆయన తెలియజేశారు.
కొలంబియా, యూకే, జర్మనీ, పనామా, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, మెక్సికో దేశాలు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉన్నాయి. కొత్తగా భారత్ చేరింది. ఈ ప్రోగ్రామ్ చేరిన దేశాల ప్రజలు అమెరికాలోని కొన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో దిగినప్పుడు వారిని మిగతా ప్రయాణికుల్లా తనిఖీ చేయరు. పొడుగాటి క్యూల్లో నిలబడి ఇమిగ్రేషన్ అధికారులు వేసే నిశిత ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు . వారి కోసం ఆటోమేటిక్ గ్లోబల్ ఎంట్రీ కియోస్క్‌లు ఉంటాయి. అయితే, ఈ ప్రోగ్రామ్ ద్వారా వెళ్లలనుకునేవారు ముందే అనుమతి పొందాలి. ఈ క్రమంలో యూఎస్ వీసా అధికారులు వారి నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ నిర్వహించి, వారితో ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం ఉండదని నిర్ధారించుకున్నాకే ఆమోదముద్ర వేస్తారు.













