భారతీయ పర్యాటకులకు ప్రవేశం వేగవంతం : అమెరికా
విదేశీ పర్యాటకుల కోసం అమెరికా ప్రారంభించిన గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్(జిఇపి)లో భారత్ చోటు సంపాదించింది. జీఈపీ కింద తమ దేశ పౌరులకు అమెరికాలో వేగవంతమైన ప్రవేశాన్ని కల్పించిన 11వ దేశం భారత్ కావడం విశేషం. దీంతో నమ్మదగిన భారతీయ పర్యాటకులు ఇకపై అమెరికాలోని విమానాశ్రయం నుంచి ఎటువంటి తనిఖీలు లేకుండా బయటకు వెళ్లిపోవచ్చు. అయితే దీని కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. భారత, అమెరికా ప్రభుత్వ కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదం పొందిన తరువాత వీసా జారీ అవుతుంది. దీని కోసం దశలవారీగా దర్యాప్తు, తనిఖీలు నిర్వహిస్తామని అమెరికా అధికారులు తెలిపారు. అయితే జిఇపి నిబంధనల ప్రకారం నిర్దేశించిన విమానాశ్రయాల్లోనే భారతీయ పర్యాటకులు ఈ సేవను వినియోగించుకోవచ్చు.













