Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా – భారత్ మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. సుంకాల విధింపు, H1B వీసాలు వ్యవహారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. రిపబ్లికన్ పార్టీ (Republican PArty) నేత అలెగ్జాండర్ డంకెన్ (Alexander Duncan), హనుమంతుడి విగ్రహంపై (Hanuman Statue) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. అలెగ్జాండర్ డంకెన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాలోని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
టెక్సాస్ (Texas) లోని షుగర్ ల్యాండ్ (Sugar Land) లో శ్రీ అష్టలక్ష్మీ ఆలయం ఉంది. ఈ ప్రాంగణంలో 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని గతేడాది ఆగస్టులో నెలకొల్పారు.దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (Statue of Union) గా పిలుస్తున్నారు. ఇది అమెరికాలోనే అతి పెద్ద విగ్రహం. రెండ్రోజుల కిందట రిపబ్లికన్ పార్టీ సెనేట్ అభ్యర్థి అలెగ్జాండర్ డంకెన్ Xలో ఓ ఈ హనుమంతుడి విగ్రహాన్ని పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఇది తప్పుడు హిందూ దేవుడి విగ్రహం. క్రైస్తవ దేశంలో ఇలాంటి వాటిని ఒప్పుకోం” అని డంకెన్ వ్యాఖ్యానించారు. “టెక్సాస్‌లో ఇలాంటి తప్పుడు విగ్రహాలు ఎందుకు అనుమతిస్తున్నాం? మేము క్రైస్తవ దేశం!” అని డంకెన్ పోస్టులో రాశాడు. బైబిల్‌లోని ఎక్సోడస్ 20:4 వాక్యాన్ని కోట్ చేశాడు. విగ్రహారాధన పాపం అని విమర్శించాడు. వచ్చే ఏడాది జరిగే సెనేట్ ఎన్నికలకు డంకెన్ రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్నాడు. ఈయన ట్రంప్ కు సన్నిహితుడిగా పేరొందాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో పొలిటికల్ క్యాంపెయన్ నడుపుతున్నాడు.
డంకన్ వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర అసంతృప్తి రేకిత్తించాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వంటి సంస్థలు డంకెన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. హిందు వ్యతిరేకిగా భావించి ఆయనపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశాయి.
వివాదం తీవ్రం కావడంతో డంకన్ తన వ్యాఖ్యలను కొంతమేర సవరించుకున్నాడు. తాను హిందూ మతానికి కానీ, ఇండియాకు కానీ వ్యతిరేకిని కానని వివరించాడు. తన మాటలు క్రైస్తవ విలువలకు సంబంధించినవని వాదించాడు. అయితే డంకెన్ వివరణపై HAF సంతృప్తి చెందలేదు. డంకన్ వ్యాఖ్యలు అమెరికా రాజ్యాంగంలోని మొదటి అమెండ్‌మెంట్‌ను (రెలిజియస్ ఫ్రీడమ్) ఉల్లంఘిస్తున్నాయని HAF డైరెక్టర్ సుమేష్ చౌదరి పేర్కొన్నారు. టెక్సాస్ GOPకు డంకెన్ పై ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియన్-అమెరికన్ రిపబ్లికన్ గ్రూప్స్ కూడా డంకెన్ వ్యాఖ్యలను తప్పుబట్టాయి.
సోషల్ మీడియాలో డంకెన్ కు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఒక సెక్యులర్ దేశమని, క్రైస్తవ దేశం కాదని నెటిజన్లు డంకన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అమెరికా – భారత్ మధ్య ఈ వివాదం కొత్త డైమన్షన్ ను జోడించింది. అయితే ట్రంప్ పార్టీ నుంచి డంకెన్ వ్యాఖ్యలపై ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. టెక్సాస్‌ను బలంగా, స్వతంత్రంగా ఉంచాలనేది తమ విధానం అని రిపబ్లికన్ పార్టీ చెప్తోంది. అయితే రెలిజియస్ ఫ్రీడమ్‌ను కాపాడాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అమెరికాలో మత ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.