రానున్న రెండు వారాలు గడ్డుకాలం : ట్రంప్
వచ్చే రెండు వారాలు అమెరికా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నదని, ఈ గడ్డుకాలన్ని అధిగమించేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా కాటుకు రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.20 లక్షలు దాటింది. 9100 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా అత్యంత గడ్డుకాలాన్ని చవిచూడబోతున్నది. భారీగా ప్రాణనష్టం జరుగవచ్చు. అయితే అమెరికా ఎన్నటికీ షట్డౌన్ కాకూడదు. దేశాన్ని ధ్వంసం కానివ్వబోం. సమస్య కంటే చికిత్స మరింత దిగజార్చేలా ఉండకూడదు నేను ముందు నుంచీ ఇదే చెబుతున్నా అని వ్యాఖ్యానించారు.













