అమెరికా తర్వాత ఇండియానే : ట్రంప్
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ముందువరుసలో కొనసాగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తరువాతి స్థానంలో భారత్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5 కోట్లకు చేరువయ్యిందని, కోటీ 20 లక్షలకుపైగా టెస్టులతో భారత్ రెండో స్థానంలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ రెండు దేశాలు మాత్రమే భారీ సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ సమయంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థ మెల్లగా పుంజుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నామని, వైరస్ ప్రమాదం పొంచివున్న వారిని వెంటనే గుర్తించి వారిని రక్షించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో వైరస్ విషయంలో చైనా తీరుపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు.













