విద్యార్థుల విచారణ వేగవంతం
అమెరికాలో వీసా గడువు ముగిసిందని కస్టడీలోకి తీసుకున్న విద్యార్థుల విచారణలో వేగం పుంజుకోనున్నది. న్యూజెర్సీలోని డిటెన్షన్ సెంటల్లో ఉన్న విద్యార్థుల్లో అరుగురికి బెయిల్ దొరికింది. నేడు, రేపు మరికొందరికి విముక్తి లభించే అవకాశం ఉన్నది. వీసా గడువు ముగిసినా అమెరికా లోనే తిష్టవేసిన విదేశీ విద్యార్థులను పట్టుకునేందుకు యూఎస్ అధికారులు ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ వర్సిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉచ్చులో 600 మంది విద్యార్థులు చిక్కుకోగా, వారిలో 130 మందిని అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. ఇందులో 129 మంది భారతీయ విద్యార్థులున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకున్న అమెరికా, దాదాపు 12 రోజులుగావారికి విచారణ తేదీలను, సరైన అధికారులను కేటాయించకుండా జాప్యం చేస్తున్నది.
విద్యార్థులను దర్యాప్తు కోసం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే తేదీలకు సంబంధించి హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు డిటెన్షన్ సెంటర్లలోని విద్యార్థులకు నేడు, రేపు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మరికొందరిని ఈ నెల చివరివారంలోనూ కోర్టులో విచారించే అకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అట్లాంటలోని విద్యార్థులు ఇంకా నిరీక్షణలోనే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే విచారణ ప్రారంభమైన చోట ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.













