ఈ సమయంలో భారత్ వెంటే..
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయు సేన చేసిన మెరుపు దాడులపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారికి సరైన రీతిలో సమాధానం చెప్పారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వంలోని కీలక నేత, రిపబ్లికన్ నేత అయిన రికీ పెర్రీ భారత చర్యలను స్వాగతించారు. ఈ మేరకు అమెరికా సెనేట్‌లో ఇతర ప్రతినిధులు అందరి ముందు ఆయన ఓ ప్రకటన చేశారు. ఉగ్ర దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన భారత్ జవాన్లకు మేము సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే వారిపై చర్యలను తీసుకోవాలి. అది పాకిస్థాన్ అయినా మరే ఇతర దేశమయినా సరే. పాక్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో దౌత్యపరంగానే భారత్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. దీన్ని మేం అభినందిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో భారత్ వెంట నిలుస్తాం అని రికీ పెర్రీ వ్యాఖ్యానించారు.













