హెచ్-1బీ వీసా రెన్యువల్…. అందుబాటులోకి పైలట్ ప్రోగ్రామ్
హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులు తమ హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌కు బైడెన్ సర్కారు ఇటీవల పచ్చజెండా ఊపింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 29 నుంచి ఈ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభమైనట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 20 వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు. తొలి దశ ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాల పాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం 4 వేలు చొప్పున వీసాలను రెన్యువల్ చేయనున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 1 మధ్య మిషన్ కెనడా జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య మిషన్ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పించారు.







