హెచ్ 1బీ వీసా కేసు.. భారతీయులకు షాక్
హెచ్ 1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకూ రద్దుచేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసిన భారతీయులకు అమెరికా న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశాలకు చెందిన ఉద్యోగులు అమెరికాలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్ 1బీ వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్ జూన్ 22న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా పౌరుల ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని విదేశీ ఉద్యోగుల నుంచే కాకుండా అమెరికా సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. వీసా రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి కూడా సరిదిద్దుకోలేని హాని చేయగలదని దిగ్గజ సాంకేతిక సంస్థలు హెచ్చరించాయి.
వర్క్ వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన 169 మంది భారతీయులు, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీసా నిషేధాజ్ఞ ఏకపక్షమైనదని, నిలకడలేదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, వీసా పక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్థించారు. కాగా, ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా ఈ పిటిషన్ను తిరస్కరించారు. తమ వాదానను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను భారతీయ ఉద్యోగులు అందించలేకపోయారని ఆయన అభిప్రాయడ్డారు.













