ఆరోగ్య బీమా ఉంటేనే అమెరికాలో ఎంట్రీ
వలసల్ని అడ్డుకోవటమే అజెండాగా ముందుకు వెళుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దిశగా మరో నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని వారికి అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రరాజ్యంలో ప్రవేశించిన 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకోకపోయినా అమెరికా ప్రవేశార్హత కోల్పోవాల్సి ఉంటుందని నిబంధన విధించారు. నవంబర్ 3 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నిబంధనల నుంచి శరణార్థులకు మాత్రం అమెరికా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. సొంతంగా వైద్య ఖర్చులు భరించలేని వారిని అమెరికాలో అనుమతించడం ద్వారా ఇక్కడి వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.













