ట్రంప్ అభిశంసన…ప్రతినిధుల సభ అంగీకారం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ సమ్మతి తెలిపింది. ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఆయనపై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం అయిన నేపధ్యంలో అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ సెనేట్‌లో విచారణ ఎదుర్కొనవలసి వస్తుంది. అక్కడ కూడా ఈ తీర్మానం ఆమోదం పొందిన పక్షంలో, అభిశంసన ప్రక్రియ పూర్తి అవుతుంది.
ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశద్రోహానికి పాల్పడ్డారని డెమొక్రాటిక్ పార్టీ తన ప్రకటనలో వివరించింది. ఇప్పటికే ట్రంప్‌పై అభిశంసన అభియోగాలకు న్యాయవ్యవహారాల సభా సంఘం ఇటీవల ఆమోదముద్ర వేసింది. సెనేట్ ఆమోదముద్రతో అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే అమెరికాలో అభిశంసన ఎదుర్కొంటున్న అధ్యక్షుల్లో ట్రంప్ మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం. గతంలో రిచర్డ్ నిక్సన్, బిల్ క్లింటన్లు ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు.
సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యే అవకాశాలు లేవనే వాదన వినిపిస్తోంది. త్వరలో ట్రంప్ సెనేట్‌లో విచారణను ఎదుర్కోనున్నారు. ఇదిలావుండగా ఈ అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ ఇటీవల ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు.













