చైనా దురాక్రమణపై యూఎస్ ప్రతినిధులసభ ఖండన
గాల్వాన్ లోయలో భారత్‌పై చైనా దురాక్రమణ విధానాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు నేషనల్ డిఫెన్స్ అథారైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)కు సవరణను యూఎస్ ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దక్షిణ చైనా సముద్రం తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ చైనా సరిహద్దు వివాదాలు పెరిగిపోతున్నాయని ప్రతినిధుల సభ పేర్కొంది. ఇండియన్ అమెరికన్ చట్టసభ్యుడు అమీ బెరాతో కలిసి స్టీవ్ ఛాబోట్ ఎన్డీఏఏ సవరణ ప్రతిపాదించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు చక్కబడేందుకు భారత్, చైనాలు ఉమ్మడిగా కృషి చేయాలని పేర్కొన్నారు. బ్రూనై, మలేసియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియాత్నాంతో పాటు ఇతర దేశాలతో చైనా వివాదాలకు దిగుతుండడాన్ని ప్రస్తావించారు. జపాన్‌తో కూడా చైనా వివాదాలున్నాయని సవరణలో పేర్కొన్నారు.













