అనాథ బాలికను దత్తత తీసుకున్న అమెరికా దంపతులు
జన్మనిచ్చిన తల్లి కర్కశంగా వదిలేసి వెళ్లిపోయిన ఆడ బిడ్డను అమెరికాకు చెందిన దంపతులు అక్కువ చేర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ విశ్రా 19 నెలలు వయస్సున్న ఆ బిడ్డను అమెరికాకు చెందిన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులకు అప్పగించారు.
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 2017, జూన్ 12వ తేదీన ఒక మహిళ తనకు జన్మించిన ఆడ శిశువును విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ శిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో ఉంచారు. జన్ననిచ్చిన వారు తీసుకెళ్లాలని అధికారులు ప్రకటించినప్పటికీ ఎవరూ ముందుకురాలేదు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటి ఆ బాలికను అరుణ అనే పేరు పెట్టారు. అరుణను దత్తత ఇస్తామంటూ అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. దీనిని చూసిన అమెరికా గ్రాండ్ ఫోర్క్స్, ఏఎఫ్బీ నార్త్ డకోటాకు చెందిన జాషువా ఎబోల్జ్, ఎమిఎబోల్జ్ దంపతులు బాలికను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. దంపతుల వివరాలను పరిశీలించినా అధికారులు ఈ అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా దత్తత ఇచ్చేందుకు అంగీకరిస్తు ఉత్తర్వులను జారీ అయ్యాయి. ప్రస్తుతం 19 నెలల వయసున్న అరుణను ఓబోల్జ్ దంపతులకు కలెక్టర్ కార్తికేయ విశ్రా అప్పగించారు. అరుణను చేతుల్లోకి తీసుకున్న ఏమి ఓబోల్జ్ ఆనందానికి అవధుల్లేవు.













